వడివడిగా కనుమరుగు అవుతున్న వేలయేళ్ల వృత్తులు... వందలేళ్ల కళలు...
తరం నుండి తరానికి సాగుతూ వచ్చి ఈతరంలో తడబడుతున్న తెలుగు అడుగులు...
అన్నింటినీ పొదివిపట్టి పదిలపరచి ముందు తరాలకు అందించే ఆశయంతో ఈ తెలుగు నడక...
తెలుగు మాట్లాడే ప్రజల ఆచార వ్యవహారాలు, కళలు, వృత్తులు, చేతి పనులు, జానపద రుచులు, అభిరుచులు కాలక్రమేణా చాలా మార్పులు చెందుతూ, ప్రస్తుతం చాల వరకూ మరుగున పడిపోతున్నాయని అందరికీ తెలిసిందే. ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాషతో సహా సంస్కృతి కూడా విపరీతమైన ఒత్తిడికి గురవుతోంది. ఏ సంస్కృతైనా మారడం సహజం. నిలుపుకోవడానికి కృషి చెయ్యగలమేగానీ, మార్పును ఆపలేం. అక్షర రూపం దాల్చిన కళలను భద్రపరచే ప్రయత్నాలు చరిత్రలో కొంత వరకూ జరిగినా, అచ్చమైన తెలుగు జానపద కళారూపాలను, వృత్తులను, చేతి పనులను చారిత్రక విలువలుగా భద్రపరిచే అవకాశం ఇంత వరకూ ఇంచుమించు లేవనే చెప్పాలి. మన సంస్కృతి మౌఖిక ప్రచారం పైనే ముఖ్యంగా ఆధారపడి ఉండడం దీనికి ప్రధాన కారణం. ఎంత ప్రయత్నించినా మౌఖికంగా ప్రచారంమయ్యే ఏ సంస్కృతినైనా యధాతథంగా అక్షరబద్ధం చెయ్యడం అసంభవం. కానీ మౌఖికంగా ప్రచారం చెయ్యగల కళాకారులు, పనివారు క్రమేణా కనుమరుగవుతున్నారు. ఉదాహరణకు, నులక మంచం అల్లడం ఒకప్పుడు అవసరమే కాదు, అది ఒక కళ. ఆ కళ తెలిసిన వారు ఇంటికోకరైనా ఉండేవారు. వారిని ఇప్పుడు మొత్తం సమాజంలోనే వేళ్ళమీద లెక్కించవచ్చు. అలాంటి కళల ఉపయోగం ఇప్పుడు ఉన్నదా లేదా అన్నది కాదు ప్రశ్న. సంస్కృతిని నిలుపుకోవాలనుకునే కోరిక ఉనికికీ, భావోద్వేగాలకీ సంబంధించింది. కేవలం అణా పైసలతో కొలవగలిగేది కాదు. ఆర్థికంగా మంచి అవకాశాల కోసం ఇతర వృత్తుల్లోకి మళ్ళే కొత్త తరాల్లో ఆయా కళలపై, చేతి పనులపై ఆసక్తి కలిగించడం జరగని పని మాత్రమే కాదు, సాంఘిక న్యాయం కూడా కాదు. ఫలితంగా ఆ సంస్కృతే కనుమరుగవుతోంది.
సరే, గతాన్ని గురించి, మరుగవుతున్న సంస్కృతి గురించి వగచి లాభంలేదు. కానీ మనకంటూ ఒక గొప్ప సంస్కృతి ఉందని కనీసం ముందు తరాలకు తెలియజేసేదెలా? అసలే భారతీయులకు చరిత్రను కాపాడుకునే ప్రవృత్తి అంతంత మాత్రం. అందులో తెలుగు వారిది మరీ అందె వేసిన చెయ్యి! ఐనా ఎంతకాలం మనల్ని మనం 'నిన్న ఎంత పొరపాటు చేశాం' అని నిందించుకుంటూ కూర్చుంటాం? ఈ పరిస్థితి నుండి బయటపడి చారిత్రక అవసరాన్ని తీర్చుకునే అవకాశం కోసం ప్రారంభించిన ఉద్యమమే 'తెలుగు నడక'. ప్రస్తుతం చవకగా అందుబాటులోకి వచ్చిన కొత్త సాంకేతిక పనిముట్ల సహాయంతో ఎలక్ట్రానిక్ మాధ్యమంలో దృశ్య, శ్రవణ రూపాల్లో అన్ని రకాల ప్రదర్శన కళలను, చేతి కళలను, కుల వృత్తులను, చేతి పనులను అతి జాగ్రత్తగా సేకరించి, భావి తరాలకోసం భద్రపరచి, అంతర్జాలంలో అందరికీ నిత్యం అందుబాటులో ఉండేట్టు చెయ్యడమే ఈ ఉద్యమ ఆశయం.
ఈ ఉద్యమానికి ప్రధాన సలహాదారు, నిర్వహణకర్త శ్రీ స. వెం. రమేశ్, ఆయనకు సహాయానికి ఎందరో ఆయన నేస్తాలు.
ఇందులో విషయ సేకరణ కోసం పల్లె పల్లెకూ తిరిగే వారికి వేతనాలు, ఆయా కళలను, చేతి పనులను ప్రదర్శించే వారికయ్యే ఖర్చులు, ప్రదర్శనలు చేసే వారికి ఇచ్చే ముడుపులు తప్ప మిగలిన పనులన్నీ స్వచ్ఛంద సేవగా జరుగుతున్నవే.
ఆర్ధిక సహాయం, దీర్ఘకాలిక ప్రయోజనాల పరిరక్షణ, నిర్వహణ బాధ్యత డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి (DTLC)
అవసరమైన సాంకేతిక సహాయం అందిస్తున్నవారు మైరా మీడియా
ఈ ఉద్యమాన్ని నిర్వహించడానికి ఇండియాలో సహాయం చేస్తున్న లాభాపేక్షరహిత సంస్థ (non-profit organization) Watershed Support Services and Activities Network (WASSAN), Hyderabad, India.
©2023. Telugu Nadaka